అక్కడ గుల్లలేంటి?

హలో జిందగీ క్లినిక్‌. నా వయసు 30 సంవత్సరాలు. వ్యక్తిగత ప్రదేశంలో నీటి గుల్లల్లాంటివి ఉన్నాయి. ఒకసారి వచ్చి తగ్గిపోయాయి. కానీ మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి. ఇదేమైనా జబ్బుకి సంకేతమా. నేను ఇప్పటి వరకూ కలయికలో పాల్గొనలేదు. నా సమస్య ఏంటి?

– ఓ పాఠకురాలు

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అది వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లా అనిపిస్తున్నది. హెర్పస్‌ జెనైటాలిస్‌ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది తొలుత ఉద్ధృతంగా వస్తుంది. తర్వాత తగ్గి నెమ్మదిస్తుంది. అయితే ఇలా తగ్గి మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. మీరు అక్కడ గుల్లలు వచ్చాయి అన్నారు కానీ, దురద, మంట ఉన్నాయా అన్నది చెప్పలేదు. ఒకవేళ ఉంటే వెంటనే గైనకాలజిస్టుని సంప్రదించండి. కొన్ని పరీక్షలు చేసి, సమస్య ఏమిటన్నది చెబుతారు. మందులు వాడితే కొంత వరకూ ఉపశమనం వస్తుంది. సాధారణంగా ఇలాంటి వైరస్‌లు కలయిక ద్వారా వస్తాయి.

మీరు ఇప్పటి దాకా సంభోగంలో పాల్గొనలేదు అన్నారు కాబట్టి అది కారణమయ్యే అవకాశం లేదు. ఒకరి లోదుస్తులు ఒకరు వేసుకోవడం, హాస్టళ్లలాంటి చోట్ల అందరి బట్టలూ కలిపి వాషింగ్‌ మెషీన్లలో వేయడం, లేదా లోదుస్తులను పక్కపక్కనే ఆరవేయడం లాంటి వాటి వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. ఏది ఏమైనా మీరు డాక్టర్‌ని సంప్రదిస్తే త్వరిత గతిన ఇబ్బంది నుంచి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన జబ్బు అయితే కాదు. భయపడాల్సిన అవసరం లేదు.

డాక్టర్‌ పి. బాలాంబ

సీనియర్‌ గైనకాలజిస్ట్‌

2024-07-02T19:49:52Z dg43tfdfdgfd