సలాడ్లు రుచికరంగా..

హలో మేడం. రకరకాల పండ్లు కూరగాయలతో చేసే సలాడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు కదా. అయితే వాటిని రుచికరంగా చేసుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా? బయట దొరికే సలాడ్లు కొనుక్కొని తిన్నా ఇంతే మేలు చేస్తాయా?

-ఓపాఠకురాలు

మీరన్నట్టు సలాడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పండ్లు, కూరగాయలు.. పచ్చిగా సహజ రూపంలో ఉండటమే కారణం. అయితే బయట దొరికే సలాడ్లు ఇందుకు భిన్నం. వీటిలో రుచి కోసం రకరకాల పదార్థాలు కలుపుతారు. ఎక్కువమందికి అందించడం కోసం తక్కువ నాణ్యతతో తయారుచేస్తారు. చక్కెరలు వాడతారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయుల్ని ఇవి ఇబ్బందిలోకి నెడతాయి. బరువు పెంచుతాయి. తక్కువ నాణ్యత కలిగిన కేనోలా, కార్న్‌, సన్‌ఫ్లవర్‌, సోయా నూనెలు ఉపయోగిస్తారు. వేడి, ఒత్తిడిలాంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులకు లోనైనప్పుడు ఇవి పాడయిపోతాయి. వీటివల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఇక, ఈ సలాడ్లలో కలిపే ఆర్టిఫీషియల్‌ ఫ్లేవర్లు సాక్షాత్తూ రసాయనాలే. ఇవి శరీరానికి విషంతో సమానం.

ఇంట్లోనే

సలాడ్లకు డ్రెస్సింగ్‌ చేసుకుని రుచిగా తినొచ్చు. దీనివల్ల చెడు కొవ్వులు, ప్రిజర్వేటివ్‌లు, అధిక కేలరీలు సలాడ్లకు జతవ్వవు.సలాడ్‌లో హంగ్‌ కర్డ్‌ (తేమ వడగట్టి ముద్ద చేసిన పెరుగు), ఉప్పు, మిరియాల పొడి చాట్‌ మసాలా కలుపుకొంటే ఎంతో రుచికరంగా ఉంటుంది.

పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలను జారుడు ముద్దగా చేసుకుని సలాడ్‌కు జోడించొచ్చు.టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనె, కచ్చా పచ్చాగా పొడి చేసిన ఎండు మిరపకాయలు, ఉప్పు, మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం కలిపి డ్రెస్సింగ్‌ చేస్తే సలాడ్‌ చకచకా తినేయొచ్చు.హంగ్‌ కర్డ్‌కు పెరిపెరి మసాలా, ఆలివ్‌ నూనె కలిపితే కారంకారంగా ఆస్వాదించొచ్చు.

మయూరి ఆవుల ,న్యూట్రిషనిస్ట్‌

[email protected]

2024-07-04T20:42:42Z dg43tfdfdgfd