మీరు ఇక్కడికి వెళ్లారో.. నాటి రోజులు గుర్తుకు రావాల్సిందే !

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ కి ప్రతి ఒక్కరూ మానసిక స్వాంతన కొరకు ప్రకృతిని ఆస్వాదించడం అలవాటుగా మారింది. ఇలా ప్రకృతిని ఆస్వాదించే వారి కోసం నగరాలు, పట్టణాలలో పార్కులు ఏర్పాటు చేశారు. అయితే పలు పార్కులు పచ్చదనాన్ని నిండుగా కలిగి ఉంటే.. పలు పార్కులు ఆహ్లాదకర వాతావరణంతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్నాయి. ఇలా ప్రకృతి అందాన్ని పెంచడమే కాక, దేశభక్తిని చాటి చెబుతున్న పార్క్ శ్రీకాకుళంలో ఉంది.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ యువతలో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు శ్రీకాకుళంలోని మున్సిపల్ పార్కులో స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనం నిర్మించారు. దాతల సహకారంతో పార్కులో స్వాతంత్య్ర సమరయోధులు, సామాజిక కార్యకర్తల విగ్రహాలను ఏర్పాటు చేశారని శ్రీకాకుళానికి చెందిన గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్ మెంటర్ వావిల్లపల్లి జగన్నాథ నాయుడు.. లోకల్ 18తో చెప్పారు.

శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో అధికారుల నిర్లక్ష్యానికి గురైన పార్కును అభివృద్ధి చేసేందుకు కొంతమంది సామాజిక కార్యకర్తలు చొరవతో ముందుకు వచ్చారన్నారు. దీంతో వారు అప్పటి జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ను ఆశ్రయించారన్నారు. కలెక్టర్ నుండి అనుమతి పొందిన తరువాత వారు ఫిబ్రవరి 13, 2021న అభివృద్ధి పనులను ప్రారంభించారు. మహాత్మా గాంధీజీకి ఇదే పార్కులో ఆలయాన్ని నిర్మించడానికి గాంధీ స్మారక నిధి, గాంధీమార్గ్ ఇండియా ఫౌండేషన్ పేరుతో నిధుల సేకరణ పూర్తి చేశారు.

గాంధీ దేవాలయం గురించి తెలుసుకున్న కొద్ది మంది దాతలు పార్కులో స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రాగా... దాదాపు 30 మంది దాతలు సహకారంతో విగ్రహాలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర తిలక్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, జవహర్ లాల్ నెహ్రూ, బీఆర్ అంబేద్కర్, చత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు, సర్దార్ గౌతు లచ్చన్న, స్వామి వివేకానంద, జ్యోతిరాజా పులే, జ్యోతిరాజా వంటి సామాజిక కార్యకర్తల విగ్రహాలు ప్రతిష్ఠించారు.

గాంధీ స్మారక నిధి మెంబర్ జగన్నాధ నాయుడు లోకల్ 18తో మాట్లాడుతూ మహాత్మాగాంధీ శాంతి, సామరస్యానికి దూత అన్నారు. గాంధీతో పాటు ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల గురించి దేశభక్తి భావ జాలాన్నియువ తరంలో వ్యాప్తి చేయడానికి తాము స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంఏర్పాటు చేసామన్నారు. ఇలా ఉన్న ఈ పార్కును సందర్శకులే కాక.. దేశభక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారట. మరి మీరు ఎప్పుడైనా ఈ పార్క్ ను సందర్శించారా !

2024-07-03T06:15:39Z dg43tfdfdgfd