బేబీకార్న్‌ కుర్‌కురే

కావలసిన పదార్థాలు

బేబీకార్న్‌: ఎనిమిది, శనగపిండి: రెండు టేబుల్‌ స్పూన్లు, బియ్యపు పిండి/కార్న్‌ఫ్లోర్‌: రెండు టేబుల్‌ స్పూన్లు, కారం: రెండు టీస్పూన్లు, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌: ఒక టీస్పూన్‌ చొప్పున, గరంమసాలా: అర టీస్పూన్‌, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్‌, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.

తయారీ విధానం

స్టవ్‌మీద గిన్నెపెట్టి రెండు కప్పుల నీళ్లుపోసి బేబీకార్న్‌ను ఐదు నిమిషాలపాటు ఉడికించాలి. చల్లారిన బేబీకార్న్‌ను సన్నగా పొడవాటి ముక్కలుగా కోయాలి. ఒక గిన్నెలో బేబీకార్న్‌ ముక్కలు, శనగపిండి, బియ్యపు పిండి, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి, బాగా కలిపి కొద్దిగా నీళ్లు చల్లి కార్న్‌ ముక్కలకు పిండి పట్టేలా కలపాలి. నీళ్లు ఎక్కువగా పోసి జారుగా కలపొద్దు. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక కార్న్‌ ముక్కలను విడివిడిగా వేసి దోరగా కాల్చుకుంటే బేబీకార్న్‌ కుర్‌కురే సిద్ధం.

2024-07-04T19:12:28Z dg43tfdfdgfd