పైకి ఇంద్ర భవనాలు.. లోపల కన్నీటి గాథలు.. ప్రభుత్వం కోరుకుంటున్నది ఇదేనా?

ఆ గ్రామాల్లో పచ్చని చెట్లు రంగురంగుల అందమైన భవనాలు.. అయితే ఈ దృశ్యాలను చూసి ఈ గ్రామాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి.. వారి వార్షిక ఆదాయం వృద్ధిలో దూసుకెళ్తుందనుకుంటే పొరపాటే. ఈ రంగురంగుల ఎత్తయిన భవనాలను చూసి ఇక్కడి ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారా.. లేదు వారి మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. ఇంతకు ఆ కన్నీటి వెనుక ఉన్న మిస్టరీ ఏమిటో తెలుసుకుందాం.

ఆ గ్రామాల్లో ఎటు చూసినా పచ్చని చెట్లు, ఎత్తైన సుందరమైన భవనాలు, సీసీ రోడ్డు డ్రైనేజీ ఇలా అన్ని సర్వాంగ సుందరంగా కనిపిస్తాయి. అయితే వారి గృహాలను చూస్తే ఇట్టే ఆకట్టుకుంటారు. కానీ వారి మాటలు వింటే మాత్రం కన్నీళ్లు ఆగవనే చెప్పాలి.. కనీసం ఆ గృహాలకు సంబంధించిన ఈయంఐ కట్టుకునేందుకు కూడా డబ్బులు లేక అమ్ముకునేందుకు సిద్ధమయ్యామని ఆ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అసలు ఈ గ్రామాల ప్రజల దుస్థితి గల కారణాలేంటి..! అసలు ఈ గ్రామ ప్రజల అవసరాలు ఏంటి అనే అంశాలను వివరించే ప్రయత్నం చేద్దాం.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని పలు గ్రామాలు మిడ్ మానేరు ముంపులో కలిసిపోయాయి. దీంతో ప్రభుత్వం పునరావాస కాలనీలను మంజూరు చేసి వారికి నూతన గృహాలను మంజూరు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వారికి కనీస ఉపాధి అవకాశాలు లేకపోవడంతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామాల్లో రంగురంగుల భవనాలు మాత్రమే కనిపిస్తున్నాయని.. తమ జీవితాల్లో మాత్రం వెలుగులు రంగులు లేవని కన్నీటి పర్యంతమవుతున్నారు అక్కడి ప్రజలు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం ప్రత్యేక చొరవతో 18 సంవత్సరాలు యువకులకు ఇవ్వాల్సిన ప్యాకేజీ త్వరగా ఇచ్చే ప్రక్రియ చేపట్టాలని , అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాలని ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. తాము నాడు ఆసాములుగా.. రైతులుగా ఉండి వివిధ గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే వారమని.. మిడ్ మానేరు జలాశయంలో తమ గ్రామాలు కలిసి పోవడంతో, తామే ఇప్పుడు వివిధ ప్రాంతాలకు కూలీలుగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. అలా వెళ్లాలని భావించినా ఉపాధి అవకాశాలు లేక, నానా అవస్థలు పడుతున్నామని లోకల్18 తో తమ ఆవేదన వెళ్ళగక్కారు.

ఇక్కడ ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి వ్యథలే మనకు కనిపిస్తాయి. ఇల్లు నిర్మించుకున్నాము కానీ ఉపాధి అవకాశాలు లేక వాటికి సంబంధించిన బ్యాంకు లోన్స్, ఈఎంఐలు కట్టేందుకు కూడా డబ్బులు లేక గల్ఫ్ బాట పట్టే పరిస్థితి ఉందని వారు వాపోయారు. మరి ప్రభుత్వం వీరికి చేకూరాల్సిన ప్యాకేజీ మంజూరు చేసి, వీరి ఆకలి కేకలకు ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

2024-07-15T08:47:44Z dg43tfdfdgfd