పారిస్‌కు.. ఫాషన్‌ రిచ్‌గా

పతకాలు ఎగరేసుకుపోవడం, పతాకాలు ఎగురవేయడం ప్రతి ఒలింపిక్స్‌లో కామన్‌! కానీ,ఈసారి జరిగే విశ్వక్రీడలు కాస్త భిన్నం. మైదానంలో పోటాపోటీగా సాగే ఆటలకు దీటుగా..ఫ్యాషన్‌ కోటలో పాగా వేయడానికి అందాల జాతర జరుగుతుంటుంది. ఎందుకంటే.. ఈ సారిఒలింపిక్స్‌కు వేదిక పారిస్‌ మరి. ఫ్రాన్స్‌ దేశానికి మాత్రమే కాదు ఫ్యాషన్‌ ప్రపంచానికీ పారిస్‌రాజధాని. అందుకే కాబోలు.. ఒలింపిక్స్‌లో సత్తా చాటడానికి సిద్ధమవుతున్న భారత క్రీడాకారులు కూడా ఫ్యాషన్‌ మంత్రాన్ని పఠిస్తున్నారు. ప్రముఖ డిజైనర్‌ తరుణ్‌ తాహిలియాని డిజైన్‌ చేసిన త్రివర్ణ రంజిత దుస్తుల్లో మన క్రీడాకారులు పారిస్‌లో ఫ్యాషన్‌ పరేడ్‌కు రెడీ అవుతున్నారు.

ప్రతిసారీ ఒలింపిక్స్‌ పోటీలు అంగరంగ వైభవంగా మొదలవుతాయి. అదిరిపోయే ఆరంభంలో సంబురం వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పరేడ్‌ నిర్వహించడం. ఆయా దేశాలకు చెందిన ఆటగాళ్లు తమ సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులు ధరించి అందులో పాల్గొంటారు. ఈ తంతులో మన క్రీడాకారులు సంప్రదాయ వస్ర్తాలు ధరించి ముచ్చట గొలుపుతారు.

ఫ్యాషన్‌ పురి పారిస్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారతీయతను భారీగా చాటాలని అధికారులు తీర్మానించారు. అందుకు తగ్గట్టుగా ఈసారి ప్రత్యేక దుస్తులను ముస్తాబు చేయించింది భారత ఒలింపిక్‌ సమాఖ్య. పతకాలు గెలవాలనే పట్టుదలతోపాటు కట్టూబొట్టూ అదిరిపోవాలనే సంకల్పంతో దుస్తుల రూపకల్పన బాధ్యతను ఓ సంస్థకు అప్పగించింది. ఆ సంస్థతో కలిసి ప్రఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్‌ తరుణ్‌ తాహిలియాని ఒలింపిక్స్‌ వేడుకల దుస్తుల్ని రూపొందించారు.

పురుష క్రీడాకారుల కోసం కుర్తాబుందీ, మహిళా క్రీడాకారుల కోసం చీరలను మువ్వన్నెల జెండా స్ఫురించేలా సింగారించారు. తెలుపు రంగు కుర్తాబుందీకి కాషాయం, ఆకుపచ్చ రంగుల అంచును చేర్చి, దుస్తులకు జాతీయ పతాక స్ఫూర్తిని జోడించారు. మువ్వన్నెల చీర బార్డర్‌లో ఆకుపచ్చ వర్ణాన్ని ఎక్కువ వెడల్పుతో, ఎరుపు రంగుని తక్కువ వెడల్పుతో రూపొందించారు.

భారతీయ చేనేత చీర అంచుల్లో, పై నుంచి కిందకి ప్రతి అంచెకు ఎక్కువ వెడల్పు వచ్చే సంప్రదాయాన్ని తాహిలియాని కొనసాగించారు. కాషాయ, ఆకుపచ్చ అంచుల్లో విభిన్న చేనేత డిజైన్లను చేర్చడం ద్వారా భారతీయ చేనేత వైభవాన్ని చాటే ప్రయత్నం చేశారు. క్రీడా సంబురాల్లో ధరించాల్సిన సంప్రదాయ దుస్తుల్ని ఇండియన్‌ హాకీ స్టార్స్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, నీలకంఠ శర్మ, కృష్ణ బహదూర్‌ పాఠక్‌, జుగ్‌రాజ్‌ సింగ్‌ ధరించి ఆవిష్కరించారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో స్పోర్టివ్‌ చర్చకు దారి చూపాయి. అదే దారిలో పారిస్‌ ఒలింపిక్స్‌లో స్పోర్టివ్‌ స్పిరిట్‌ని చాటుకోవాలని భారతీయుల కోరిక.

రెడీమేడ్‌ శారీ

చీరను అందరూ ఇష్టపడతారు. కానీ, కట్టడానికి కష్టపడతారు. చీర చుట్టడం, కుచ్చిళ్లు పోయడానికి చాలా సమయం పడుతుంది. క్రీడాకారులకు అంత సమయం ఉంటుందా? అందునా ఒలింపిక్స్‌లో పతకాల వేటకు సిద్ధమైన క్రీడాకారులకు ఇబ్బంది రాకుండా, ధరించడానికి కష్టం లేకుండా రెడీమేడ్‌ చీరలు రూపొందించారు తరుణ్‌ తాహిలియాని. పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే మహిళా క్రీడాకారిణుల కోసం పవిట, చీర కుచ్చిళ్లను ముందే కుట్టారు. ఈ రెడీమేడ్‌ చీరలు ధరించడానికి తేలికగా, సౌకర్యంగా ఉంటాయట.

4oly

2024-07-04T21:42:57Z dg43tfdfdgfd