చలో.. సోలో!

రోజులు మారేకొద్దీ మనుషుల అభిరుచుల్లో మార్పు వస్తున్నది. ఒకప్పుడు విహారం అనగానే అమ్మానాన్న, తాతాబామ్మ, అత్తామామ, పిన్ని బాబాయ్‌ వాళ్ల పిల్లలు ఇలా కుటుంబాలన్నీ లగేజీలతో సిద్ధమయ్యేవి. తర్వాతి కాలంలో అది ఒక ఇంటికే పరిమితమైంది. స్నేహితులంతా జట్టుకట్టి సాహస యాత్రలు చేయడం ఎప్పుడూ ఉండేదే! ఇప్పుడు యమునా తీరానికి విహారానికి వెళ్లాలనుకున్నా.. ఎవరికి వారే అన్న చందాన తయారైంది.

నలుగురితోపాటు నారాయణ అనకుండా సోలోగా చెక్కేయడానికి మొగ్గు చూపుతున్నారు. పురుషులు మాత్రమే కాదు… అతివలు కూడా ఇదే ధోరణిని కనబరుస్తున్నారు. తాజా అధ్యయనం ఒకటి ఈ విషయాన్ని దృఢపరుస్తున్నది. అమెరికాకు చెందిన ఓ పరిశోధక బృందం వెయ్యి మందితో ఒక సర్వే నిర్వహించింది. దాని ప్రకారం ముఖ్యంగా ఉద్యోగినులు ఒంటరి ప్రయాణాలను ఇష్టపడుతున్నారట. రోజువారీ పని ఒత్తిడికి దూరంగా కొన్ని రోజులైనా ప్రశాంతంగా గడపాలని సోలో ట్రిప్‌కు ఓటేస్తున్నారట. రొటీన్‌ లైఫ్‌కు విరుగుడు మంత్రం విహారం.

అందమైన ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ హాయిగా కాలం గడపాలి. అప్పుడు కూడా ఫ్యామిలీని వెంటేసుకొని వెళ్తే థ్రిల్‌ ఏముంటుందని వాళ్ల అభిప్రాయం. అందులోనూ నిజముంది కదండీ! కుటుంబంతో విహారానికి వెళ్లినా… ఆడవాళ్లకు ఇంట్లో ఉన్నంత పని మీదపడటం ఖాయం. పిల్లల దుస్తులు, వాళ్ల తిండీతిప్పలు ఇవన్నీ చూసుకోవడంతోనే సమయం అంతా గడిచిపోతుంది. అందుకే ఏ బాదరబందీ లేకుండా ఒంటరి విహారానికి వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారట.

2024-07-04T19:27:33Z dg43tfdfdgfd