కాబూల్‌ బుల్‌బుల్‌

అతివల సౌందర్యాన్ని ఇనుమడింపజేసేవి ఆభరణాలు. అందానికి తగ్గ ఆహార్యం ఉంటే సరిపోదు, దానికి తగిన విధంగా నగలు వేసుకున్నప్పుడే అమ్మడి లుక్కు మరింత అదిరిపోతుంది. ఒంపుల వైఖరి తెలియజేసే ఇంపైన నగలు ఎన్నో ఉన్నాయి. నయా డిజైనర్‌ ఆభరణాలు కొన్నయితే, ట్రెడిషనల్‌ ఆభరణాలు మరికొన్ని. ఈ రెండిటి మేలు కలయికగా అచ్చెరువొందిస్తున్నాయి ఆఫ్గన్‌ జువెలరీ. ఇంకేం ఈ యాంటిక్‌ నగలను ధరించి కాబూల్‌ బుల్‌బుల్‌గా వయ్యారాలు ఒలకబోయండి.

రాళ్ల మెరుపులు.. పూసల తళుకులు.. వెండి సింగారం కలగలసి రూపొందినవే అందమైన ఆఫ్గనీ నగలు. శతాబ్దాల కళా వారసత్వానికి ఇవి ప్రతీక. ఆఫ్గనిస్తాన్‌ దేశ సంప్రదాయాలు, చరిత్రను ప్రతిబింబించే ఈ ఆభరణాల శైలి ఎంతో ప్రత్యేకమైనది. కండ్లు చెదిరే రంగులు, సంక్లిష్టమైన డిజైన్లు, తళుకుమనే రాళ్లు, మెరిసిపోయే రత్నాలు కలబోతగా రూపొందిన ఈ నగలు చూడముచ్చటగా ఉంటాయి. సిల్వర్‌ ఫిలిగ్రీ శైలిలో సిద్ధమైన నగలు ధరిస్తే రిచ్‌ లుక్‌ ఇట్టే సొంతమవుతుంది.

ఈ ఆఫ్గన్‌ జువెలరీలో ప్రతీ ఆభరణమూ ప్రత్యేకమైనదే! ఒక్కో డిజైన్‌ ఒక్కో చరిత్రను, అర్థాన్ని తెలియజేస్తుంది. లాపిస్‌ లాజులీ రకం నీలిరంగు రాళ్లతో కూడిన నగలు రక్షణను ఇస్తాయని ఆఫ్గన్ల నమ్మకం. అంతేకాదు ఈ నగలు అదృష్టానికి ప్రతీకలుగా భావిస్తారు. ఇక నీలం, ఆకుపచ్చ రంగు రాళ్లు పొదిగిన నగలు దుష్టశక్తులను దూరం చేస్తాయని నమ్ముతారు. ఎనామిల్‌ రంగులు అద్దుకొని పర్షియన్‌ లుక్కును పొందిన ఆఫ్గన్‌ హ్యాండ్‌మేడ్‌ నగలకు నేటికీ విశేష ఆదరణ ఉన్నది. వెండితో తయారవడం వల్ల వీటి ధర కూడా అందరికీ అందుబాటులోనే ఉంది. బంగారం ఇష్టపడే వారికోసం పుత్తడి మెరుపులు అద్దినవి కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఆఫ్గన్‌ ఆభరణాలను ఒకసారి ప్రయత్నించండి!

2024-07-04T20:12:37Z dg43tfdfdgfd