ఈ మహావృక్షంకు సెల్యూట్ చేయాల్సిందే.. చరిత్ర తెలుసుకుంటే ఔరా అనేస్తారు !

మొక్కలు పెంచితే భావితరాలకు ఉపయోగపడతాయని భావించిన మహనీయులు వాటి పెంపకంపై ఏనాడో దృష్టి సారించారు. నాటి స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిష్ వారిపై పోరాటం కోసం వివిధ ప్రాంతాలు పర్యటించిన గాంధీ, నెహ్రూ వంటి మహానుభావులు ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటారు. అదే విధంగా మన సిక్కోలులో 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రచారంలో భాగంగా గాంధీజీ శ్రీకాకుళంలో పర్యటించి దూసి రైల్వే స్టేషన్ లో ఒక మర్రి మొక్కను నాటారు. ఆ మర్రి మొక్క నేటికీ కూడా మహా వృక్షంగా మనకు కనిపిస్తుంది. ఇంతకు ఆ మహావృక్షం విశేషాల గురించి తెలుసుకుందాం !

బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమ ప్రచారంలో భాగంగా గాంధీజీ దేశమంతా రైల్లో ప్రయాణిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ శ్రీకాకుళం జిల్లా దూసి రైల్వే స్టేషన్ లో దిగారు.. సుమారు 15 నిమిషాల పాటు దూసి రైల్వే స్టేషన్ వద్ద ప్రసంగించారు. తర్వాత అక్కడ ఒక మర్రి మొక్కను నాటారు. ఇప్పుడు ఆ మర్రి మొక్క బాపూజీ తరహా లోనే ఒక మహా వృక్షంగా ఎదిగి రెండు ఎకరాల్లో విస్తరించింది. ఎందరో బాటసారులకు నీడను ఇస్తోంది. మేధావుల ఆశయాలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడతాయనడానికి ఇదే నిదర్శనమని మేధావులు తెలుపుతున్నారు.

స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన.. జిల్లాలలో శ్రీకాకుళం జిల్లా ఒకటి. ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఉన్న జిల్లాగా సిక్కోలుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో 1942లో గాంధీ పర్యటించినట్లు చరిత్ర చెబుతోంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆముదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్లో గాంధీజీ పర్యటించి భారీ సభ నిర్వహించారు. ఈ సభలో సిక్కోలు నుండే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన ప్రజలు కూడా భారీగా సభకు హాజరయ్యారని నేటికీ స్థానికులు చెబుతుంటారు.

కాగా నాడు గాంధీ నాటిన మొక్క ఇప్పుడు మహా వృక్షం కావడంతో నాటి సభకు నేటి గుర్తుగా ఈ చెట్టు ఉందని, ఇది తమ గ్రామానికి గర్వకారణమని స్థానికులు తెలిపారు. ఈ చెట్టును చూసి స్థానిక ప్రజలు సెల్యూట్ చేస్తారట కూడా. ఇంత ప్రాధాన్యత గల ఈ మర్రి చెట్టుకు ఆ స్థాయిలో గుర్తింపు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గాంధీ నాటిన ఈ మహా వృక్షం ప్రాధాన్యత తెలియజేసే విధంగా బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. భావి తరాలకు స్వాతంత్ర ఉద్యమంలో జరిగిన ముఖ్య ఘట్టాలు తెలుసుకొనేందుకు నిదర్శనంగా ఉన్న ఈ మర్రి చెట్టు సంరక్షణ బాధ్యతలు చూడాల్సిన భాద్యతను అధికారులు గుర్తించాలని లోకల్18 ద్వారా స్థానిక ప్రజలు విన్నవించారు.

2024-07-04T14:05:55Z dg43tfdfdgfd