RAW MANGO CHUTNEY: పచ్చిమామిడి పెసరపప్పు చట్నీ, స్పైసీగా చేసుకుంటే నోరూరిపోతుంది

Raw Mango Chutney: పచ్చి మామిడికాయలతో ఎన్నో రకాల పచ్చళ్లు చేస్తారు. అలాంటి వాటిల్లో ఒకటి పచ్చిమామిడి పెసరపప్పు చట్నీ. దీని కోసం పుల్లని మామిడిని తీసుకోవాలి. తీయని మామిడికాయ తీసుకుంటే చట్నీ రుచి బాగోదు. కాబట్టి పుల్ల మామిడినే ఎంచుకోవాలి. ఈ చట్నీ అల్నంలోకి,ఇడ్లీ, దోశెల్లోకి మంచి కాంబినేషన్. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

పచ్చిమామిడి పెసరపప్పు చట్నీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పచ్చి మామిడి తరుగు - ఒక కప్పు

పెసరపప్పు - అర కప్పు

జీలకర్ర - ఒక స్పూను

బెల్లం తురుము - అర స్పూను

ఎండు మిర్చి - నాలుగు

ఉప్పు - రుచికి సరిపడా

ఆవాలు - అరస్పూను

మినప్పప్పు - అర స్పూను

ఎండు మిర్చి - ఒకటి

ఇంగువ - పావు స్పూను

కరివేపాకులు - గుప్పెడు

నూనె - సరిపడినంత

పచ్చిమామిడి పెసరపప్పు చట్నీ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి పెసరపప్పును వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.

2. అదే కళాయిలో జీలకర్ర,ఎండు మిర్చి వేసి వేయించాలి. వాటిని చల్లబరచాలి.

3. మిక్సీలో పెసరపప్పు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి పొడిలా చేసుకోవాలి.

4. అందులోనే పచ్చి మామిడి తరుగు, బెల్లం, ఉప్పు వేసి రుబ్బుకోవాలి. అవసరం మేరకు నీరు కలుపుకోవాలి.

5. ఆ మొత్తం మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి.

6. ఇప్పుడు తాళింపు కోసం స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకుని నూనె వేయాలి.

7. ఆ నూనెలో ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకులు, ఇంగువ వేసి వేయించాలి.

8. ఈ మొత్తం తాళింపును పచ్చడిపై వేసుకోవాలి. అంతే పచ్చి మామిడి పెసరపప్పు చట్నీ రెడీ అయినట్టే.

పెసరపప్పు చలువ చేస్తుంది. కాబట్టి శరీరవేడిని తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు పెసరపప్పు తినడం మంచిది. పెసరపప్పులో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. కాబట్టివ శాకాహారులు పెసరపప్పు తినడం వల్ల శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ పొందవచ్చు. ఇక పచ్చి మామిడి కాయలో కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. పచ్చి మామిడిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పొట్ట నొప్పి, డయేరియా, అజీర్ణం వంటివి రాకుండా కాపాడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా మామిడికాయ ముందుంటుంది. డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఇది అడ్డుకుంటుంది.

2024-07-04T06:22:48Z dg43tfdfdgfd