PERIOD PRODUCTS: ప్యాడ్స్ బదులు ఇవి వాడితే ఎన్ని లాభాలో ఊహించలేరు.. చిన్న మార్పుతో గొప్ప మేలు..

మహిళ తన జీవిత కాలంలో దాదాపు 350 ప్యాకెట్ల శానిటరీ ప్యాడ్లు వాడుతుందట. ఒకే ఒక డిస్పోజబుల్ శ్యానిటరీ ప్యాడ్ భూమిలో కలిసి పోవడానికి దాదాపు 800 సంవత్సరాలు పడుతుంది. ఇక మనం ప్రకృతికి చేస్తున్న హాని గురించి మీరే ఆలోచించండి. డిస్పోజబుల్ శానిటరీ న్యాప్‌కిన్లకు బదులు రీయూజబుల్ పీరియడ్ ఉత్పత్తులు వాడాలని ఉంటుంది. కానీ వాటి వాడకం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయనే భయమూ ఉంటుంది. వీటిని సరైన పద్ధతిలో వాడితే 23.8 శాతం మామూలు శ్యానిటరీ న్యాప్‌కిన్ తో వచ్చే ర్యాషెస్ కన్నా తక్కువగా వస్తాయట. అందుకే వీటి గురించి, వీటి వాడకం గురించి తెల్సుకోవడం మనకూ, పర్యావరణానికి అత్యవసరం.

రీ యూజబుల్ మెన్స్టువల్ కప్స్, పీరియడ్ అండర్ వేర్, రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్, రీయూజబుల్ ట్యాంప్లన్లు.. ఇలా చాలా రకాల ఉత్పత్తులు మళ్లీ మళ్లీ వాడుకునేలాగా అందుబాటులో ఉన్నాయి. వీటితో డబ్బు కూడా దీర్ఘకాలంలో ఆదా అయినట్లే.

వీటివాడకం విషయంలో ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెల్సుకోండి.

రీయూజబుల్ ప్రొడక్ట్స్ అంటే..

మామూలుగా వాడే శానిటరీ న్యాప్‌కిన్ ఒకసారి వాడగానే పడేస్తాం. కానీ వీటిని మళ్లీ మళ్లీ శుభ్రం చేసుకుని వాడుకోవచ్చు. బిఎమ్‌సీ హెల్త్ 2023 లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 37 శాతం మహిళలు రీజయూబుల్ శానిటరీ ఉత్పత్తులు వాడుతున్నారు. అందులో 24 శాతం పీరియడ్ అండర్ వేర్, 17 శాతం మంది మెన్‌స్ట్రువల్ కప్స్ వాడారు. 5 శాతం రీయూజబుల్ ప్యాడ్స్ వాడారట.

వాటి గురించి తెల్సుకోండి..

  1. మెన్‌స్ట్రువల్ కప్ కప్ లాగా ఉంటుంది. యోని లోపల దీన్ని పెట్టుకోవాలి. ఈ కప్పు వాడాక ఖాళీ చేసి శుభ్రంగా కడిగేయాలి. మెడికల్ గ్రేడ్ సిలికాన్ తో దీన్ని తయారు చేస్తారు.
  2. పీరియడ్ అండర్ వేర్ తడిని తొందరగా పీల్చేసుకునే వస్త్రంతో తయారు చేస్తారు. ఇది ప్యాంటీలాగా ఉంటుంది కాబట్టి నెలసరి సమయంలో మళ్లీ ప్యాంటీ కానీ, ప్యాడ్ కానీ వాడాల్సిన అవసరం లేదు. ఉతికేసి మళ్లీ వాడుకోవచ్చు.
  3. రీయూజబుల్ ప్యాడ్స్ శ్యానిటరీ న్యాప్ కిన్ లాంటివే. మూడు లేయర్లలో దీన్ని తయారు చేస్తారు. కింది భాగంలో లీక్ ప్రూఫ్ వస్త్రం ఉంటుంది. కాబట్టి లీకేజీ భయం అక్కర్లేదు. వీటిని కూడా ఉతుక్కుని వాడుకోవచ్చు.

వీటిని వాడే సరైన విధానం ఇదే..

రీయూజబుల్ పీరియడ్ ఉత్పత్తుల విషయంలో జాగ్రత్త అవసరం. వాటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేన్ని ఎలా శుభ్రం చేయాలో చూడండి.

1. మెన్స్ట్రువల్ కప్స్:

వీటిని వాడే ముందు చేతులు, కప్ శుభ్రం చేసుకోవాలి. ఈ కప్ అంచు మీద నీళ్లు లేదా ఏదైనా లూబ్రికెంట్ రాయాలి. దీన్ని సగానికి మడిచి యోని లోపల పెట్టుకోవాలి. లోపల పెట్టి ఒకసారి తిప్పాలి. కప్ ఫిక్స్ అవుతుంది. వీటిని 12 గంటల కన్నా ఎక్కువ వాడకూడదు. ఈ కప్ తీసేటప్పుడు కూడా చేతులు కడుక్కోవాలి. చూపుడు వేలు, బొటన వేలు కలిపి కప్ కింద ఉండే స్టెమ్ పట్టుకుని నొక్కాలి. దాంతో కప్ వదులుగా అయిపోతుంది. మళ్లీ శుభ్రం చేసి పెడితే వాడుకోవచ్చు. వీటిని శుభ్రం చేయడానికి మెన్ట్స్రువల్ కప్ స్టెరిలైజర్ వాడొచ్చు. లేదంటే వేడినీళ్లలో మరిగించి కడిగేయాలి.

2. పీరియడ్ అండర్ వేర్:

పీరియడ్స్ లో హెవీ ఫ్లో లేదా అధిక రక్తస్రావం అయ్యే రోజుల్లో వీటిని వాడితే చాలా సౌకర్యం ఉంటుంది. లీకేజీ భయం ఉండదు. సరైన ఫిట్టింగ్ ఉన్నవి ఎంచుకుంటే చాలు. ప్యాంటీలాగా వీటిని వేసుకోవడమే. ఒకరోజు కన్నా ఎక్కువగా దీన్ని వాడకూడదు. వాడిన తర్వాత స్క్రబ్బర్ లేదా బ్రష్ తో శుభ్రం చేయాలి. ఎండలో బాగా ఆరనివ్వాలి.

3. రీయూజబుల్ ప్యాడ్స్:

మామూలు శానిటరీ న్యాప్ కిన్ లాగా దీన్ని కూడా ప్యాంటీకి పెట్టుకోవడమే. వీటికుండే క్లిప్స్ లాంటి సదుపాయం వల్ల ప్యాడ్ అటూ ఇటూ కదలదు. వాడిన తర్వాత నీల్లలో నానబెట్టి శుభ్రం చేయాలి. అవసరమైతే మెషిన్ వాష్ చేయొచ్చు. ఎండలో ఆరబెట్టడం తప్పనిసరి.

2024-07-04T09:23:03Z dg43tfdfdgfd