NATURAL CONTRACEPTION: ప్రెగ్నెన్సీ రావొద్దంటే.. పక్కాగా పనిచేసే ఈ సహజ మార్గాలు ఫాలో అవ్వండి..

పిల్లలను ఆలస్యంగా కనాలనుకునే వాళ్లకి, లేదంటే ఇద్దరు పిల్లలకి మధ్య కాస్త సమయం తీసుకోవాలి అనుకునేవాళ్లకి ఏదో ఒక గర్భనిరోధక మార్గం అవసరం అవుతుంది. కొందమంది వైద్యుల్ని సంప్రదించి కాపర్ టి లాంటి గర్బనిరోధక విధానాలూ అనుసరిస్తారు. అయితే అవి కాకుండా కొన్ని లక్షణాలు, లెక్కల ఆధారంగా సహజంగానే గర్భం దాల్చకుండా ఆపవచ్చు. అవేంటో తెల్సుకోండి. వీటికోసం ఏ మందులు వాడాల్సిన పనిలేదు.

సహజ గర్భనిరోధక పద్దతులు:

ఈ పద్దతులు సరిగ్గా పాటిస్తే మీరు గర్బం దాల్చే అవకాశాలు 5శాతం కన్నా తక్కువే ఉంటాయి. ఏ పద్ధతిలో అయినా శరీరాన్ని అర్థం చేసుకునే పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పీరియడ్స్, అండం విడుదల అయ్యే రోజులు లాంటి వాటి ఆధారంగా ఈ పద్ధతులన్నీ ఉంటాయి. అవేంటో చూద్దాం.

సైకిల్ బీడ్స్ మెథడ్:

దీని పేరు చెబుతున్నట్లుగానే పూసలతో చేసిన ఒక దండ లాంటిది ఉంటుంది. దాంట్లో రకరకాల రంగుల్లో పొడవాటి పూసలుంటాయి. ఉదాహరణకు దండలో బ్రౌన్, తెలుపు, ఎరుపు, నలుపు రంగు పూసలుంటాయి అనుకుందాం. ఎరుపు రంగు పూస మీ పీరియడ్ మొదలైన రోజు సూచిస్తుంది. తెలుపు రంగు పూసలు శృంగారంలో పాల్గొన్నా కూడా ప్రెగ్నెన్సీ రాని రోజులు అని తెలియజేస్తాయి. బ్రౌన్ రంగు పూసలున్న రోజుల్లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయంటమాట. పీరియడ్ మొదలైన రోజు నుంచి ఈ దండలో ఉండే రింగును కదుపుతూ ఉండాలి. మీరు ఈ సైకిల్ బీడ్స్ కొనుక్కున్న బ్రాండ్ వాళ్లే ప్రత్యేకంగా మరికొన్ని మెలకువలు కూడా చెబుతారు.

ఈ సైకిల్ బీడ్స్ గనక సరిగ్గా వాడితే 95శాతం ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవట. అయితే దీన్ని ఫాలో అవ్వాలంటే మీ నెలసరి క్రమం తప్పకుండా రావాలి.

సర్వైకల్ మ్యూకస్ మెథడ్:

వజైనా నుంచి వచ్చే డిశ్చార్జి ఆధారంగా ఈ పద్దతి ఉంటుంది. సాధారణంగా పీరియడ్స్ అయిపోగానే డిశ్చార్జి చాలా తక్కువగా ఉంటుంది. ఓవల్యూషన్ సమయంలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బట్టి అండం విడుదల అవుతుందని తెలుస్తుంది.

అలాగే అండం విడుదలయ్యే సమయంలో డిశ్చార్జి రంగులో, చిక్కదనంలో మార్పు వస్తుంది. ఈ సమయంలో వైట్ డిశ్చార్జి పారదర్శకంగా, సాగే గుణంతో ఉంటుంది. అచ్చం గుడ్డులో తెల్లసొన లాగా అన్నమాట. టిష్యూ గానీ, చేతి వేళ్లను గానీ వాడి దీన్ని పరీక్షించుకోవచ్చు. ఈ గుర్తులు కనిపిస్తే శృంగారానికి దూరంగా ఉండాలి.

బేసల్ బాడీ టెంపరేచర్ మెథడ్:

అండం విడుదలయ్యింది అని చెప్పడానికి మరోమార్గం శరీర ఉష్ణోగ్రతను చెక్ చేసుకోవడం. ఈ పద్ధతిలో థర్మామీటర్ తో శరీర ఉష్ణోగ్రతను ప్రతిరోజూ ఒకే సమయంలో చెక్ చేసుకొని నోట్ చేసుకోవాలి. ఉదయం లేవగానే చెక్ చేసుకోవడం ఉత్తమం. అండం విడుదలయ్యే రోజుల్లో శరీర ఉష్ణోగ్రత దాదాపు 0.5 డిగ్రీ ఫారన్ హీట్ ఎక్కువుంటుంది. కచ్చితంగా చెప్పాలంటే 0.4 నుంచి 0.8 డిగ్రీలు ఎక్కువగా ఉండొచ్చు. ఈ సమయంలో కలయికలో పాల్గొనకుండా ఉంటే సరిపోతుంది. క్రమం తప్పకుండా పీరియడ్స్ వచ్చే వాళ్లలో ఈ పద్ధతి మంచి ఫలితాలిస్తుంది.

సాధారణంగా పీరియడ్స్ వచ్చిన 5 వ రోజు నుంచి కలయికలో పాల్గొంటే గర్బం దాల్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి 5వ రోజు నుంచి శరీర ఉష్ణోగ్రత చెక్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందో ఆ రోజు నుంచి తర్వాత మూడు రోజులు అండం విడుదలయ్యే అవకాశాలుంటాయి. కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువగా వచ్చిన తర్వాత మూడు రోజులు కలయికలో పాల్గొనకూడదు. తర్వాత రోజు నుంచి మళ్లీ పీరియడ్ వచ్చేదాకా కలయికలో పాల్గొన్నా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు తక్కువ.

వీటితో పాటే మీ ఫోన్లో ఓవల్యూషన్ ట్రాకర్ లాంటి యాప్స్ వాడటం వల్ల ఫలదీకరణం సమయం గురించి మీకు ఒక ఆలోచన ఉంటుంది. ఈ పద్ధతులన్నీ తప్పులు లేకుండా పాటిస్తే గర్భనిరోదకాలుగా పనిచేస్తాయి. తప్పులు పెరిగినా కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే శాతం పెరగుతూ ఉంటుంది.

2024-07-15T12:36:39Z dg43tfdfdgfd