CELEBS DRESSES: సెలెబ్రిటీలు వేసుకునే బట్టలన్నీ వాళ్లవేనా? తెర వెనక జరిగేదిదే..

ఒక డ్రెస్సును పలుమార్లు వేసుకునే సెలెబ్రిటీలు దాదాపు ఎవ్వరూ ఉండరనే చెప్పొచ్చు. ఒక్కసారి వేసుకున్న దుస్తుల్లో మరోసారి కనిపించరు. లక్షల రూపాయలు విలువ చేసే ఈ బట్టలు ఏం చేస్తారు? డబ్బులన్నీ బట్టలకే ఖర్చు పెట్టేస్తారా? ఫొటోలు ఎలా దిగుతారు? లాంటి ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. కొంతమందికే వీటి మీద పూర్తి అవగాహన ఉంటుంది. అసలు తెర వెనకాల ఏం జరుగుతుందో చెప్తూ ఫ్యాషన్, పాప్ కల్చర్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ పేజీ డైట్ సబ్యా అనే పేజీలో వైరల్ పోస్ట్ పెట్టారు. దాని గురించి పూర్తి వివరాలు చదివేయండి.

అన్నీ అద్దెకు తెచ్చుకున్న బట్టలే:

ఈ పేజీలో ఫాలోవర్లు తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఈ తెర వెనక జరిగే క్రమాన్ని వివరించారు. అన్ని బట్టలు అద్దెకు తెచ్చుకున్నవే. లేబుల్డ్, కస్టమ్, అర్కైవల్ అనే పదాలు వాడినా కూడా అవన్నీ అద్దెకు తెచ్చుకుని వేసుకున్న దుస్తులే అని ఆ పోస్టులో పెట్టారు. ఈవెంట్ అయిపోయాక వాటిని డ్రై క్లీనింగ్ చేసి తిరిగి ఇచ్చేయాలి.

ఒక్క రూపాయీ ఇవ్వరు:

సెలిబ్రిటీలు ఒక లేబుల్ లేదా డిజైనర్ కి సంబంధించిన బట్టలు వేసుకుని సోషల్ మీడియాలో పెడితే డిజైనర్లకి, లేబుల్ కి పాపులారిటీ వస్తుంది. ఒక్కొక్క సెలెబ్రిటీకి మిలియన్లలో ఫాలోవర్లుంటారు మరి. దాంతో వచ్చిన పాపులారిటీతో క్లిక్ అవుతామని చాలా మంది సెలెబ్రిటీలకు బట్టలు ఇవ్వడానికి పోటీపడుతూ ఉంటారు. అసలు ఏం జరుగుతుందంటే.. సెలిబ్రిటీలకుండే ప్రత్యేక పీ‌ఆర్‌లు బట్టలను సెలెక్ట్ చేస్తారు. స్టైలిస్టులు వాటిని కలెక్ట్ చేసుకుంటారు. సెలెబ్రిటీలు ఆ బట్టలు వేసుకుంటారు. మీడియా వాటి ఫొటోలు తీసుకుంటుంది. పర్సనల్ ఫొటోషూట్ చేసుకుంటారు. వాటిని డిజైనర్లు, సెలెబ్రిటీలు వాళ్ల పేజీల్లో పెట్టుకుంటారు. ఇదొక బిజినెస్. దీనికి సెలిబ్రిటీలు ఎలాంటి ధరా చెల్లించరు.

ఫొటోలు ఎప్పుడు తీసుకుంటారు?

దాదాపుగా సెలెబ్రిటీలు ఈవెంట్ అయిపోయాక డ్రై క్లీనింగ్ చేసి ఆ బట్టల్ని డిజైనర్లకు తిరిగి ఇచ్చేస్తారు. కొన్నిసార్లు వాటిని ఉంచుకోవాలి అనుకుంటే కొంత ధర పెట్టి కొనేసుకుంటారు. ఇక అంత బిజీ ఈవెంట్లో ఫొటోలు ఎలా తీసుకున్నారో అనుమానం చాలా మందికి ఉంటుంది. ఈవెంట్ కన్నా ముందు ఫొటోషూట్ తీసుకోవడం చాలా మంది ఫాలో అవుతారు. అలా కుదరకపోతే ఈవెంట్ అయిపోయాక ప్రత్యేకంగా ఫొటోషూట్ చేయించుకుని వాటిని అప్పుడు అప్లోడ్ చేస్తారు. వాటిలో డిజైనర్లను, స్టైలిస్టులను ట్యాగ్ చేస్తారు.

2024-07-16T02:53:59Z dg43tfdfdgfd