25 PAISE COIN STUCK | ఎనిమిదేళ్లుగా శ్వాసనాళంలో 25 పైసల నాణెం.. తొలగించిన డాక్టర్లు

లక్నో: ఒక వ్యక్తి శ్వాసనాళంలో 25 పైసల నాణెం (25 Paise Coin Stuck) చిక్కుకుంది. ఎనిమిదేళ్లుగా అక్కడ ఉండిపోయింది. చివరకు దీనిని గుర్తించిన డాక్టర్లు సర్జరీ ద్వారా ఆ నాణేన్ని బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి విండ్‌పైప్‌లో 25 పైసల నాణెం చిక్కుకోవడంతో ఏళ్లుగా ఇబ్బంది పడ్డాడు. బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లోని సుందర్‌లాల్ హాస్పిటల్‌ డాక్టర్లు దీనిని గుర్తించారు. 8 ఏళ్లుగా ఆ నాణెం శ్వాసనాళంలో చిక్కుకున్నట్లు తెలిసి షాక్‌ అయ్యారు. కార్డియో-థొరాసిక్ సర్జన్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ లఖోటియా, ప్రొఫెసర్ ఎస్‌కే మాథుర్ నేతృత్వంలోని వైద్యుల బృందం మంగళవారం 20 నిమిషాల పాటు సర్జరీ చేశారు. వ్యక్తి శ్వాసనాళంలో చిక్కుకున్న 25 పైసల నాణేన్ని సురక్షితంగా బయటకు తీశారు.

కాగా, పెద్దల్లో శ్వాసనాళంలోకి వస్తువులు ప్రవేశించడం చాలా అసాధారణమని డాక్టర్లు తెలిపారు. ఎనిమిది ఏళ్లుగా దీనిని గుర్తించలేదన్నారు. ఇలాంటి వాటి వల్ల ప్రాణహాని కలుగవచ్చని తెలిపారు. ఊపిరితిత్తులను దెబ్బతీయం, న్యుమోనియాకు దారి తీయడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర సమస్యల వల్ల కూడా రోగులు చనిపోయే అవకాశం ఉందని అన్నారు.

మరోవైపు మరో వ్యక్తి శ్వాసనాళంలో పదేళ్లపాటు చిక్కుకున్న అల్మారా తాళంచెవిని కూడా బీహెచ్‌యూ డాక్టర్లు ఇటీవల విజయవంతంగా బయటకు తీశారు.

2024-07-03T14:24:04Z dg43tfdfdgfd